AP CABINET MINISTERS : నూతన మంత్రులకు శాఖల కేటాయింపు...పవన్‌కి ప్రాధాన్యం !

0

ముఖ్యమంత్రి చంద్రబాబు తన సహచర మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్‌కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. లోకేశ్‌​కు ఈసారి విద్యాశాఖతో పాటు ఐటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ శాఖలు అప్పగించారు. ఉదయం నుంచి ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వకుండా తన నివాసంలో శాఖల కేటాయింపుపై సుదీర్ఘ కసరత్తు చేసిన చంద్రబాబు శాఖల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ చరిత్రలో తొలి సారిగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత వంగలపూడి అనిత కు హోంశాఖ కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం.

పూర్తి స్థాయి కసరత్తు 

అమాత్యులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూర్పును పూర్తి చేశారు. సాధారణ పరిపాలనతో పాటు శాంతిభద్రతలు, ఇతర మంత్రులకు ఎవరికీ కేటాయించని శాఖలు ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. ఊహించినట్లుగానే జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లోకేశ్‌ నిర్వర్తించిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా వంటి కీలక శాఖల బాధ్యతలు ఈసారి పవన్‌ కల్యాణ్‌​కు కేటాయించడం విశేషం. లోకేశ్‌ గతంలో తాను నిర్వర్తించిన ఐటీ శాఖ తో పాటు విద్య, మానవ వనరులు, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌​లను ఉంచుకున్నారు. ఇక ఇతర మంత్రులకు కేటాయించిన శాఖలను పరిశీలిస్తే గత ఐదేళ్ల ప్రతిపక్షంలో పోలీసుల నుంచి అనేక వేధింపులు, ఎస్సీ నేతైన తనపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎదుర్కొన్న వంగలపూడి అనితకు పోలీసు సెల్యూట్‌ దక్కేలా శాఖ కేటాయింపు జరిగింది. హోంశాఖతో పాటు విపత్తు నిర్వహణ శాఖలను అనితకు అప్పగించారు. సీనియర్‌ నేత అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌, పశుసంవర్ధక శాఖలను కేటాయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో యనయల రామకృష్ణుడు నిర్వర్తించిన ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖలతోపాటు శాసనసభ వ్యవహారాల బాధ్యతలను పయ్యావుల కేశవ్‌కు అప్పగించారు. కొల్లు రవీంద్రకు గనులు, జియాలజీ, ఎక్సైజ్‌ శాఖ ల బాధ్యతలు ఇచ్చారు. నాదెండ్ల మనోహర్‌​కు ఆహార, పౌరసరఫరాల శాఖను కేటాయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో తాను నిర్వర్తించిన మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖలను ఈసారి కూడా పొంగూరు నారాయణ కొనసాగించనున్నారు. అమరావతి నిర్మాణంతో పాటు రాజధాని వ్యవహారంపై నారాయణకు పూర్తిస్థాయి పట్టు ఉన్నందునే ఆయనకు అవే శాఖలను తిరిగి కట్టబెట్టారు. కొత్తగా మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న నిమ్మల రామానాయుడుకు జలవనరుల అభివృద్ధి శాఖను అప్పగించారు. పోలవరం పూర్తే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు సర్కారు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అదే ప్రాంతానికి చెందిన రామానాయుడుకు ఈ బాధ్యతలు అప్పగించారు. బీజేపీ నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సత్యకుమార్‌ యాదవ్‌కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖల బాధ్యతలు కేటాయించారు. ఎన్‌ఎండీ ఫరూక్‌కు న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖను అప్పగించారు. ఆనం రామనారాయణరెడ్డికి దేవదాయ శాఖను కేటాయించగా, అనగాని సత్యప్రసాద్‌కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలిచ్చారు. గృహనిర్మాణం, సమాచార శాఖలను కొలుసు పార్థసారథికి కేటాయించగా, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలను అప్పగించారు. విద్యుత్‌ శాఖను గొట్టిపాటి రవికుమార్‌ కు ఇవ్వగా పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతను కందుల దుర్గేశ్‌​కు కేటాయించారు. గుమ్మడి సంధ్యారాణికి మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం బాధ్యతలు అప్పగించారు. బీసీ జనార్దన్‌ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖలను కేటాయించారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలను టీజీ భరత్‌​కు ఇవ్వగా, సవితకు బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత శాఖలను కేటాయించారు. వాసంశెట్టి సుభాష్‌కు కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవల శాఖలను కేటాయించారు. కొండపల్లి శ్రీనివాస్‌కు ఎంఎస్‌‍ఎంఈ, సెర్ప్‌, ఎన్‌‍ఆర్‌ఐ వ్యవహారాలు అప్పగించారు. మండిపల్లి రామ్‌‍ప్రసాద్‌ రెడ్డికి రవాణా, యువజన, క్రీడల శాఖల బాధ్యతలు ఇచ్చారు.

ఎవరెవరికి ఏ శాఖలు

చంద్రబాబు - సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, పబ్లిక్‌ ఎంటర్‌​ప్రైజెస్‌ & ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు

పవన్‌ కల్యాణ్‌ - డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణం, శాస్త్ర & సాంకేతిక

నారా లోకేశ్‌ - మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్స్‌, ఆర్టీజీ

కింజరాపు అచ్చెన్నాయుడు- వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌, పశుసంవర్థక, పాడి అభివృద్ధిక్ష మత్స్య

కొల్లు రవీంద్ర- గనులు & భూగర్భ, అబ్కారీ

నాదెండ్ల మనోహర్‌- ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు

పి. నారాయణ- పురపాలక & పట్టణాభివృద్ధి

వంగలపూడి అనిత- హోం & విపత్తు నిర్వహణ

సత్యకుమార్‌ యాదవ్‌- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం &  వైద్య విద్య

ఎన్‌. రామానాయుడు- జలవనరుల అభివృద్ధి

ఎన్‌.ఎమ్‌.డి ఫరూక్‌- లా & జస్టిస్‌, మైనారిటీ సంక్షేమం

ఎ. రామనారాయణ రెడ్డి- దేవదాయ

పయ్యావుల కేశవ్‌- ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు & అసెంబ్లీ వ్యవహారాలు

అనగాని సత్యప్రసాద్‌- రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్‌

కొలుసు పార్థసారథి- గృహ, సమాచార- పౌరసంబంధాలు

డోలా బాల వీరాంజనేయస్వామి- సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, సచివాలయం & విలేజ్‌ వలంటీర్‌

గొట్టిపాటి రవి- విద్యుత్తు

కందుల దుర్గేశ్‌- పర్యటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ

జి. సంధ్యారాణి- మహిళా & శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం

బీసీ జనార్దన్‌​రెడ్డి- రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు

టీజీ భరత్‌- పరిశ్రమలు & వాణిజ్యం, ఆహార శుద్ధి

ఎస్‌. సవిత- బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, జౌళి & వస్త్ర పరిశ్రమ

వాసంశెట్టి సుభాశ్‌- కార్మిక- కర్మాగార- బాయిలర్స్‌ & వైద్య బీమా సేవలు

కొండపల్లి శ్రీనివాస్‌- ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌​ఆర్‌​ఐ సాధికారత, సంబంధాలు

ఎం. రామ్‌ ప్రసాద్‌ రెడ్డి- రవాణా, యువజన & క్రీడలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !