NEET : నీట్‌ యూజీ పరీక్షపై కేంద్రానికి, ఎన్టీఏకి సుప్రీం నోటీసులు !

0

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్‌ యూజీ 2024 పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన నీట్‌ పరీక్షలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్‌ మార్కులు వచ్చాయి. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాయి. నీట్‌ పరీక్ష నిర్వహణ, ఫలితాల్లో అవకతవకలపై సీబీఐచే విచారణ  జరిపించాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాయి. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది.

కేంద్రానికి సుప్రీం నోటీసులు !

పిటిషన్‌పై రెండు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి సుప్రీం నోటీసులు జారీ చేసింది. వీటితోపాటు సీబీఐ, బీహార్‌ ప్రభుత్వానికి కూడా నోటీసులిచ్చింది. అనంతరం తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. నీట్‌ పరీక్షకు సంబంధించి దాఖలైన ఇతర పెండిరగ్‌ పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని స్పష్టం చేసింది. అప్పటి లోపు వివరణాత్మక స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్టీయేకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ ఏడాది నీట్‌ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అయితే, 2019 నుంచి ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం, టాపర్లుగా నిలవడంతో నీట్‌ పరీక్షలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు మొదలయ్యాయి. ఇప్పటివరకు నీట్‌ యూజీలో ఒక్కసారి కూడా ముగ్గురికి మించి టాపర్లు లేరు. 2019, 2020లో ఒక్కొక్కరు చొప్పున టాపర్లుగా నిలిచారు. 2021లో ముగ్గురు, 2022లో ఒక్కరు, 2023లో ఇద్దరు టాప్‌ స్కోరు సాధించారు. కానీ, ఈసారి అసాధారణ రీతిలో 67 మంది టాపర్లుగా నిలవడం, వీరిలో హర్యానాలో ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన ఆరుగురు ఉన్నారనే వార్తలు రావడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ అంశంపై విద్యార్థులు దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు.

గ్రేస్‌ మార్కులు లేకుండా కౌన్సిలింగ్‌కి వెళ్ళొచ్చు.

ఈ క్రమంలోనే 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్‌ మార్కులను రద్దు చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘పరీక్ష సమయంలో కోల్పోయిన సమయం వల్ల గ్రేస్‌ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్‌ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించింది. వారికి రీ-టెస్ట్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తాం. జూన్‌ 23న పరీక్ష నిర్వహించి ఈ నెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తాం. ఆ తర్వాతే కౌన్సెలింగ్‌ ఉంటుంది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయకూడదని అనుకునే వారు.. గ్రేస్‌ మార్కులు లేకుండా ఒరిజినల్‌ మార్కులతో జులై 6 నుంచి ప్రారంభమయ్యే కౌన్సెలింగ్‌కు వెళ్లొచ్చు’ అని సుప్రీం కోర్టుకు కేంద్రం వెల్లడిరచింది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !