- పేరుకే రూ. 600 కోట్లు, ఇవ్వకుండా ఉండేందుకు సవాలక్ష షరతులు !
- ఎగ్జామ్ ఫీజుల రూపంలో కోట్ల సంపాదన !
- తల్లిదండ్రులారా, పరీక్షల పేరుతో పిల్లలపై అనవసరపు ఒత్తిడి పెంచకండి !
మార్కెటింగ్‌లో ఇదో పద్ధతి. కొందరు మాటలతో ఆకట్టుకుంటే, మరి కొందరు డబ్బు ఆశ చూపి ఆకట్టుకుంటారు. ఫిడ్జి రెండో రకం. కోట్లాది రూపాయలు ఎరగా వేసి విద్యార్థుల సమాచారాన్ని సేకరించటంతో పాటు టాలెంటెడ్ స్టూడెంట్స్‌ను ఫిడ్జిలోకి తీసుకరావటమే టార్గెట్‌గా ఫిడ్జి టాలెంట్ రివార్డ్ ఎగ్జామ్ పేరుతో స్కాలర్‌షిప్‌ను నిర్వహిస్తోంది. 2023 సంవత్సరంలో నిర్వహించిన ఎగ్జామ్‌లో ఫలితాల ప్రకటన రోజున స్కాలర్‌షిప్ సాధించిన విద్యార్థుల వివరాలు బహిరంగంగా ప్రకటించలేదు. అంత నిజాయితీ ఉంటే రూ. 300 కోట్ల స్కాలర్‌షిప్ సాధించిన వివరాలు ఎందుకు బహిరంగపరచలేదో ఫిడ్జి వివరణ ఇవ్వాల్సి ఉంది. మళ్ళీ ఇప్పుడు అదే పాత టెక్నిక్...కానీ ఈ సారి రూ. 600 కోట్లు, కానీ ఈ రూ. 600 కోట్లు ఫిడ్జిలోని ప్రోగ్రామ్స్‌లో & హాస్టల్స్‌లో చదివే వారికి మాత్రమే అని ప్రకటించింది. అంటే ఈ ఎగ్జామ్‌లో బాగా మార్కులు సాధించిన విద్యార్థులకు వచ్చే సంవత్సరం ఉచిత లేదా ఫీజు రాయితీలతో ఫిడ్జిలోనే చదువుకునేలా చక్రవ్యూహం రచించింది. దీనికి స్కాలర్‌షిప్ అని అందమైన పేరు చెప్పి తల్లిదండ్రులను, విద్యార్థులను మభ్యపెడుతోంది.
సోషల్ మీడియాలో భారీ ప్రచారం !
రూ. 600 కోట్లు స్కాలర్‌షిప్, రూ. 600 కోట్ల స్కాలర్‌షిప్...వ్రాయటమే తరువాయి...మీకు సొంతం అవుతుంది అని పదే పదే ప్రకటనలు గుప్పిస్తారు. ఆకర్షితులైన తల్లిదండ్రులు తమ పిల్లలపై పరీక్షల ఒత్తిడిని పెంచుతున్నారు. ఇప్పటికే ఉన్న పరీక్షలకు తోడు అదనపు పరీక్షలతో అదనపు ఒత్తిడికి గురి అవుతున్నారు. పరీక్ష అనంతరం సెలక్ట్ కాలేదు అని చిన్న కారణం చూపి విద్యార్థుల వివరాలను సేకరిస్తోంది ఫిడ్జి. డేటా సేకరణతో విద్యార్థుల ఇంటింటికి ఫిడ్జి తన పీఆర్‌ఓలతో అంత రాయితీ ఇస్తాం, ఇంత రాయితీ ఇస్తాం అంటూ మభ్యపెట్టి స్కూల్స్‌లో/ కాలేజీల్లోకి విద్యార్థులను మళ్ళించుకుంటూ అడ్మిషన్లు పోగేసుకుంటోంది. సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 6 వ తేదీ వరకు 8 రోజుల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్ నిర్వహించనుంది. దీని కోసం రూ. 150/- నుండి 900/- వరకు ఎగ్జామ్ ఫీజు వసూలు చేస్తోంది. ఫీజుల రూపంలో కోట్లు దండుకుంటోంది.
షరతులతో మెలికలు !
రూ.600 కోట్ల స్కాలర్‌షిప్ ఇస్తున్నాం...కానీ ఫిడ్జి ప్రోగ్రామ్స్ & హాస్టల్‌లో చదివితేనే ఇస్తాం అని షరతులతో కూడిన మెలికలు పెడుతోంది. ఒకవేళ ఎవరైనా విద్యార్థి వేరే సంస్థలో చదువుతూ ఫిడ్జి టాలెంట్ రివార్డ్ ఎగ్జామ్‌లో మంచి ఫలితం వచ్చినా ప్రయోజనం దక్కదు. ఎందుకంటే వచ్చే సంవత్సరం చచ్చినట్టు ఫిడ్జి సంస్థలో అడ్మిషన్ తీసుకున్న వారికే మాత్రమే ఆ ప్రయోజనం వర్తిస్తుంది. లేదంటే స్కాలర్‌షిప్ రాదు. కావలంటే వెబ్‌సైట్‌లో ఫిడ్జి నిబంధనలను నిశితంగా పరిశీలించండి, రూ. 600 కోట్ల వద్ద పెద్ద పెద్ద అక్షరాలతో ఫిడ్జి ప్రోగ్రామ్స్ & హాస్టల్ ఫీజలు మీద మాత్రమే అని షరతులు విధించింది. వీటితో పాటుగా రూ. 15 కోట్ల నగదు బహుమతులు అని ప్రకటించింది. విధించిన షరతులు అన్నీ ఫిడ్జి సంస్థకు అనుకూలంగా పెట్టుకుంది. చివరికి మోసపోతున్నది విద్యార్థులే. ప్రతి సంవత్సరం ఫిడ్జి టాలెంటెడ్ స్టూడెంట్స్ కోసం ఇలాగే స్కాలర్‌షిప్ పేరుతో ఎగ్జామ్స్ నిర్వహించి ప్రతిభావంతులను తన సంస్థలో చేర్చుకుంటుంది. తద్వారా వారి ప్రతిభకు మెరుగులు దిద్దుతూ ఇంటర్ తదనంతర పోటీపరీక్షలో 100 లోపు ర్యాంకుల కోసం తీవ్రమైన కృషి చేస్తుంది. వాటిలో ర్యాంకు వచ్చిందంటే చాలు మళ్ళీ కొన్నాళ్ళు అడ్మిషన్లకు ఢోకా ఉండదు. అందుకోసమే దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలన్నీ 10 లోపు, 100 లోపు ర్యాంకుల కోసం స్కాలర్‌షిప్ పేరుతో వల విసురుతున్నాయి. తల్లిదండ్రులారా తస్మాత్ జాగ్రత్త.