Kolkata Doctor Murder : కోల్‌కతా వైద్యురాలి ఘటనపై సుప్రీంకోర్ట్‌ సంచలన వ్యాఖ్యలు !

0

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్ట్‌ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈసందర్భంగా దారుణం చోటుచేసుకున్న ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ తీరుపై మండిపడిరది. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ అంటూ కోర్టు ప్రశ్నించింది. ప్రిన్పిపాల్‌ రాజీనామా చేసినా వేరే కాలేజీకి ఎందుకు నియమించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విద్యార్థిని తల్లిదండ్రులను 3గంటల పాటు ఎందుకు వెయిట్‌ చేయించారు. క్రైమ్‌ సీన్‌ ను ఎందుకు సీల్‌ చేయలేక పోయారు? అత్యాచారం, హత్యను బలవన్మరణంగా ఎందుకు చిత్రీకరించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం ఎందుకు ఆలస్యమైందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫొటో, పేరును ప్రచురించడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రిన్సిపల్‌ ఏం చేస్తున్నారు ?

విచారణ సందర్భంగా బెంగాల్‌ ప్రభుత్వం, కోల్‌కతా పోలీసులు, మెడికల్‌ కాలేజీ అధికారుల తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ‘‘ఈ ఘటనలో నేరాన్ని ఉదయాన్నే గుర్తించినట్లు తెలిసింది. కానీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారు. అతడి ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు.. వెంటనే మరో కాలేజీకి ఎలా నియమించారు? ఇక, ఎఫ్‌ఐఆర్‌ నమోదు కూడా ఆలస్యమైంది. మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 4 గంటల మధ్య శవ పరీక్ష పూర్తయ్యింది. కానీ, మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తర్వాత రాత్రి 11.45 గంటలకు ఎందుకు నమోదు చేయాల్సివచ్చింది? ఆసుపత్రి అధికారులు, కోల్‌కతా పోలీసులు అప్పటివరకు ఏం చేస్తున్నారు?. మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులు గంటల పాటు వేచిచూసేలా ఎందుకు చేశారు? ’’ అని సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తు స్టేటస్‌ రిపోర్ట్‌ను ఆగస్టు 22 కల్లా సమర్పించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది.

ఓ జాతీయ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు !

‘‘మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే.. పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే. ఈ రోజుల్లో చాలామంది యువ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారు. వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రొటోకాల్‌ను రూపొందించడం అత్యవసరం. మాపై విశ్వాసం ఉంచండి. క్షేత్రస్థాయిలో మార్పులు తెచ్చేందుకు మరో అత్యాచారమో లేదా హత్యనో జరిగేవరకు మనం ఎదురుచూడొద్దు’’ అని ధర్మాసనం వెల్లడిరచింది. దీనికోసం 10 మందితో ఓ జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను సుప్రీంకోర్టు ఏర్పాటుచేసింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌. నాగేశ్వర్‌ రెడ్డి, సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆర్తి శరిన్‌, ఎయిమ్స్‌ దిల్లీ డైరెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపింది. వైద్యుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై మూడు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఈ కమిటీని సూచించింది.

అధికారం చెలాయించొద్దు..

ఈ సందర్భంగా ఘటనను నిరసిస్తూ జరిగిన ఆందోళనలపై బెంగాల్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘శాంతియుత నిరసనకారులపై అధికారం చెలాయించొద్దు. ఇది దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం. డాక్టర్లు, పౌరసమాజాన్ని అడ్డుకోవడం సరికాదు. క్రైమ్‌ సీన్‌ను రక్షించాల్సిన, శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే’’ అని ధర్మాసనం మందలించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !