SUPERME COURT : SC, ST వర్గీకరణపై సుప్రీం సంచలన తీర్పు !

0


ఎస్సీ, ఎస్టీ వర్గీకరణల్లో వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపింది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది.   ఈ క్రమంలో గతంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది. తాజా చారిత్రక తీర్పులో.. ఏడుగురు న్యాయమూర్తుల్లో ఒక్క జస్టిస్‌ బేలా త్రివేది మాత్రం విరుద్ధమైన తీర్పును ఇచ్చారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదని బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. దీంతో 6-1 తేడాతో తుది తీర్పు వెలువడిరది.

నేపథ్యం !

సామాజిక న్యాయం లక్ష్యంగా భారత రాజ్యాంగం దేశంలో విడిపోయి ఉన్న కులాలను చాలా శాస్త్రీయంగా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎఫ్‌.సి.లుగా వర్గీకరించింది. షెడ్యూల్‌ కులాలకు సంబంధించి అంటరానితనానికి గురవుతున్న కులాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి వారికి రిజర్వేషన్‌ అవకాశాలు కల్పించింది. అయితే ఇలా కులపరంగా రిజర్వేషన్‌ పొందుతున్న తరగతుల్లో మాలలే అగ్ర భాగాన ఉన్నారని ఆరోపిస్తూ, ఈ తేడాను సవరించాలని ఎమ్మార్పీఎస్‌ ఉద్యమం చేస్తూ ఎ, బి, సి, డి కేటగిరీల వారీగా ఎస్సీలను వర్గీకరించాలని కొన్నేళ్లుగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలను కోరుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. పంజాబ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ద పంజాబ్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ అండ్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ (రిజర్వేషన్‌ ఇన్‌ సర్వీసెస్‌) యాక్ట్‌-2006’ను సవాలు చేస్తూ పదుల సంఖ్యలో ధర్మాసనంకు పిటిషన్లు వచ్చాయి. ఇందులో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిటిషినర్‌గా ఉన్నారు.

కేసు ఏంటంటే..

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎస్సీలకు 22.5% రిజర్వేషన్‌ కల్పిస్తుండగా.. పంజాబ్‌లో అది 25శాతంగా ఉంది. పంజాబ్‌ రిజర్వేషన్ల చట్టంలోని సెక్షన్‌ 4(5) ప్రకారం.. ఎస్సీ రిజర్వేషన్లలో వాల్మీకి, మజ్హబీ సిక్కులు పోటీలో ఉంటే.. వారికి ప్రాధాన్యతనిస్తూ 50% కోటాను కేటాయించాలి. ఈ చట్టం వల్ల ఎస్సీల్లోని ఇతర కులస్థులు ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ పంజాబ్‌-హరియాణా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 2010లో పంజాబ్‌ సర్కారుకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునిచ్చింది. 2011లో పంజాబ్‌ సర్కారు దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లగా.. ఇతర పిటిషనర్లు సైతం వ్యాజ్యాలను దాఖలు చేశారు.  2020లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది.  కోఆర్డినేట్‌ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిన అవసరం ఉందని.. దీనిపై పునస్సమీక్షించాలని పేర్కొంటూ ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది.  2020 ఆగస్టు 27న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా(ప్రస్తుతం రిటైర్‌ అయ్యారు) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ విషయాన్ని పరిశీలించేందుకు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం అవసరమని స్పష్టం చేశారు. అసలు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ చేయొచ్చా? అనే అంశంపై న్యాయపరమైన ప్రశ్నలను పరిశీలించేందుకు ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తోపాటు.. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ బేలా.ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ సతీశ్‌చంద్ర మిశ్రాల ధర్మాసనం ఈ విచారణను ప్రారంభించింది.

ఫిబ్రవరిలో..

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా? లేదా? అనే అంశంపై దాఖలైన 23 పిటిషన్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో సీజేఐ రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వేసిన పిటిషన్‌ కూడా ఉంది. వీటిపై మూడురోజులపాటు వాదనలు జరగ్గా.. ఫిబ్రవరి 8వ తేదీన తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు బెంచ్‌ ప్రకటించింది. ఇప్పుడు.. ఐదు నెలల తర్వాత ఆ తీర్పు ఏంటో ఇప్పుడు వెల్లడిరచింది.

కేంద్రం వాదనలు

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా సరైన పథకాలు రూపొందించేందుకు ప్రభుత్వాలకు వీలు కలుగుతుందని వాదనల సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వర్గీకరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో వాదనలు వినిపించింది. రిజర్వేషన్ల అసలైన లక్ష్యం చేరుకోవాలంటే కోటాను హేతుబద్ధీకరించడం చాలా ముఖ్యమని, రిజర్వేషన్‌ ప్రయోజనాలను విస్తరించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వెనుకబడిన వర్గాల్లో అట్టడుగున ఉన్న వారికి లబ్ధి చేకూరుతుందని తెలిపింది. వెనుకబడిన వర్గాలు/కులాలకు సమానత్వం, సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగం, రాజ్యం (ప్రభుత్వం) లక్ష్యం అని, వర్గీకరణ చేపట్టడం ద్వారా అవసరం ఉన్నవారికి ఈ ప్రయోజనాలు అందుతాయని వాదనలు వినిపించింది.

మంద కృష్ణ ఎమోషనల్‌!

మరోవైపు.. సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణ మాదిగ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా ఎదుటే ఆయన కంటనీరు పెట్టుకున్నారు. ‘మా 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది. ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకున్నారు. అమిత్‌షా, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డికి ధన్యవాదాలు. వర్గీకరణ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నాం. రిజర్వేషన్ల సిస్టమ్‌ ఇప్పుడు రెండో అడుగు వేయబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యం. వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. రీ-నోటిఫికేషన్లు ఇవ్వాలి’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మందకృష్ణ మాదిగ కోరారు. వర్గీకరణకు జనాభా లెక్కలతో పనిలేదని మరోసారి గుర్తు చేశారు. త్వరలో విజయోత్సవ సభ.. ఇందుకు సహకరించిన వారికి కృతజ్ఞత సభలు ఉంటాయని మందకృష్ణ వెల్లడిరచారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !