దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంది. ఇప్పటికే జాతీయ , ప్రాంతీయ పార్టీలు బలంగానే ఉన్న ఈ రాష్ట్రంలో వాటిని ఢీకొనేందుకు సినీ నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అనే పేరుతో పార్టీ పెట్టడమే కాకుండా ఆదివారం తొలి రాజకీయ సభను నిర్వహించి సక్సెస్ అయ్యాడు. విళుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని వి.సాలైలో మహానాడు బహిరంగ సభ ద్వారా విజయ్ నిజంగా హీరో అనిపించుకున్నాడు. తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని..తప్పని సరిగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇక ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వంపై పేరు ప్రస్తావించకుండా తనదైన స్టైల్లో సెటైరికల్‌గా విమర్శలు చేసారు.
పొలిటికల్ సెటైరికల్ మూవీ..
సినిమా హీరోలకు రాజకీయాలు అర్ధం కావు.. సినిమా వాళ్లు రాజకీయాల్లో రాణించలేరు.. వంటి పొలిటికల్ పార్టీలు చేసే విమర్శలను ఓ చిన్న కథగా చెప్పుకొచ్చాడు విజయ్. ముందుగా బహిరంగ సభ వేదికపైకి నడుచుకుంటూ వస్తున్న విజయ్‌ని చూసి జనం కేకలు, అరుపులతో హోరెత్తించారు. మరికొందరు పార్టీ రంగులోని కండువాలను విసిరివేసి ఆయనకు సపోర్ట్ చేశారు. అందరి మధ్యలో చిరునవ్వులు చిందిస్తూ వచ్చిన విజయ్ చిన్న కథ చెప్పి అందరి దృష్టిని అకట్టుకున్నాడు. వేదికపై విజయ్ చెప్పిన కథే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నటుడు విజయ్. అతను చెప్పిన చిన్న కథ ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఫస్ట్ స్పీచ్‌తో రెబల్ అయిన విజయ్..
రాజకీయాల్లో రాణించాలంటే కాస్తో..కూస్తో ప్రత్యర్ధులపై పంచ్‌లు కురిపించాలి అనే లాజిక్ పట్టుకున్న విజయ్ తన తొలి సభ ప్రసంగంలోనే ఆ వాగ్ధాటిని ప్రదర్శించాడు. ముందుగా దేశ స్వాతంత్య్రం కోసం, రాష్ట్రం కోసం పాటు పడిన యోధులు, మహనీయుల్ని స్మరించుకున్న విజయ్ తన రాజకీయ శత్రువులను ఓ లిస్టుగా తయారు చేసుకున్నట్లుగా సభలో ఆయన ప్రసంగం ద్వారా తేటతెల్లనైంది. ప్రజలకు తాను ఏం చేయాలనుకున్నాడో చెప్పే ప్రసంగం మధ్యలోనే ఓ చిన్న కథ చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు.
కథ రూపంలో ప్రత్యర్ధులపై పంచ్‌లు..
నేను మీకు ఒక చిన్న కథ చెప్పనా? ఇది ఆడియో లాంచ్ లాగా ప్రేరణ కలిగించే కథ కాదు. ఒక దేశంలో ఎప్పుడైతే పెద్ద యుద్ధం వచ్చిందో ఆ దేశపు శక్తిమంతమైన నాయకత్వం పోయి ఆ బాధ్యత పచ్చ ఎద్దు చేతుల్లోకి వచ్చింది అని చెప్పాడు. దీనికి కొనసాగింపుగా ఆ దేశంలోని పెద్ద తలకాయలంతా భయపడ్డారు. చిన్న పిల్లవాడు ఆ దేశంలో సైన్యాన్ని నడిపించే బాధ్యతను స్వీకరించాడు ఇది యుద్ధభూమిలా ఉంటుందని చెప్పాడు. ఐతే ఇదంతా పేరు చెప్పకుండానే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పిన తర్వాత కొందరు చేసిన కామెంట్స్‌ని వినిపించాడు. నువ్వు చిన్న పిల్లవాడివి. ఇది పెద్ద యుద్ధభూమి. శక్తివంతమైన ప్రత్యర్థులు చాలా మంది ఉంటారు, మైదానంలో వారు కలిసే ప్రతిదీ సాధారణమైనది కాదు, వినండి, ఇది ఆట కాదు. సైన్యాన్ని నిర్వహించాలి. యుద్ధంలో శత్రువులందరినీ అధిగమించి దాడి చేయడం చాలా ముఖ్యం. ఆ యుద్ధంలో గెలవడమే ముఖ్యం.
యుద్ధానికి నేను రెడీ అంటూ సంకేతం..
ఏ కూటమి లేకుండా మీరు ఆ యుద్ధం ఎలా చేయగలరు? ఎలా గెలవాలి? అని పెద్ద తలకాయలందరూ ప్రశ్నించగా, సమాధానం చెప్పకుండా ఒంటరిగా సైన్యంతో యుద్ధానికి వెళ్లిన పాండ్య వంశానికి చెందిన ఆ బాలుడు ఏమయ్యాడో సంఘ సాహిత్యంలో చాలా చక్కగా చెప్పబడిరది. చదవని వారు చదివిన పాఠకులను అడిగి తెలుసుకోండి. కానీ బ్యాడ్ బాయ్ సార్ ఆ చిన్న పిల్లవాడు. అన్నాడు. ‘‘నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ, నేను పాలిటిక్స్ విషయంలో భయపడడం లేదు’’ అని నటుడు విజయ్ అన్నారు. ‘సినిమా కెరీర్‌లో అత్యున్నత స్థాయిని వదిలేసి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా నన్ను అవమానించారు. అయినా, కఠోర శ్రమ, ధైర్యంతో ఈ స్థాయికి చేరుకున్నా. ఎంజీఆర్, ఎన్టీఆర్ సైతం ఇదే విధమైన విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారు ప్రభంజనం సృష్టించారు. ప్రతి ఓటు ఎంతో శక్తిమంతమైనది.. మా పార్టీ తమిళనాడు రాజకీయాలపై బలమైన ప్రభావం చూపుతుంది’’ అన్నారు. పొత్తులపై మాట్లాడుతూ.. ‘‘రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని పూర్తిస్థాయి మెజార్టీతో గెలిపిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఒకవేళ ఏవైనా పార్టీలు పొత్తు పెట్టుకోవాలనుకుంటే.. వారికి అధికారంలో భాగస్వాముల్ని చేస్తాం’’ అన్నారు.
పార్టీ సిద్ధాంతాలు ఇవే !
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడిగా విజయ్ తమ పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను ప్రకటించారు. ‘‘ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తాం. తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్లులాంటివి. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా భావజాలం. వాటి ఆధారంగానే పని చేస్తాం. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. రాజకీయాల్లో ఫెయిల్యూర్స్, సక్సెస్ స్టోరీలు చదివాక.. నేను నా కెరీర్‌ని పీక్‌లో వదిలేసి మీ అందరిపై అచంచలమైన విశ్వాసాన్ని ఉంచి మీ విజయ్‌గా ఇక్కడ నిలబడ్డా. రాజకీయ అనుభవం లేదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అమితమైన ఆత్మవిశ్వాసంతో మనం సర్పం (రాజకీయం)తో ఆడుకునే పిల్లల్లాంటివాళ్లం’’ అన్నారు.
సమ సమాజానికి కృషి.. అవినీతిపై పోరాటం
సభా వేదికపై ఆ పార్టీ నేత ప్రొఫెసర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ.. తమిళగ వెట్రి కళగం పార్టీ సిద్ధాంతాలు, విధానాలను వివరించారు.. ‘‘పుట్టుకతోనే మనుషులంతా సమానం. సమ సమాజాన్ని సృష్టించడమే పార్టీ లక్ష్యం. దీంతో పాటు సెక్యులరిజం, రాష్ట్ర స్వయంప్రతిపత్తి, సమ్మిళిత అభివృద్ధి, ద్విభాషా విధానం, అవినీతిపై పోరాటం, తిరోగమన ఆలోచనల తిరస్కరణ, డ్రగ్స్ రహిత తమిళనాడు వంటివి ప్రధాన అంశాలు’’గా పేర్కొన్నారు. అనంతరం మరో నేత కేథరిన్ మాట్లాడుతూ.. ‘‘మదురైలో సచివాలయం శాఖ ఏర్పాటు, కుల గణన , విద్యను రాష్ట్ర జాబితాలోకి మార్చేందుకు ఒత్తిడి చేయడం, గవర్నర్ పదవి రద్దుకు ప్రతిపాదన, మూడిరట ఒక వంతు స్థానాలు మహిళలకు కేటాయించడం’’ వంటివి తమ లక్ష్యాలుగా పేర్కొన్నారు.
సినీ రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్ అని పేర్కొన్నారు. విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం పార్టీ మొదటి మహానాడులో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలతోపాటు వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సభకు వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.