- ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకేనా ?
- చివరి దశకు కాళేశ్వరం కమీషన్ విచారణ.
- చర్యల నుండి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరవుతున్న మేఘా ?
తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడిం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మేగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ ముందుకొచ్చింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి కంపెనీ తమ సీఎస్‌ఆర్ ఫండ్స్ నుంచి రూ.200 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్‌ఎస్ సుబ్బారావు సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
అంచనాలు పెంచేసి భారీ దోపిడీ
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అధిక భాగం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ చేసింది. ఈపీసీ పద్దతిలోనే పనులు కొనసాగాయి. అయితే, ప్రాజెక్ట్ పనుల్లో అంచనాలు విపరీతంగా పెరిగాయి. కేంద్ర జలసంఘం డీపీఆర్‌లో ఆమోదించిన ఖర్చుకి అంచానాలకు తేడా అక్షరాలా రూ.67 వేల 406 కోట్లు. దీన్నిబట్టే అర్థం చేసుకోండి ఎంతగా దోపిడీ జరిగిందో. నిజానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ మొదలైంది. వ్యాప్కోస్ తయారు చేసిన డీపీఆర్‌లో రూ.81,911 కోట్ల ఖర్చుతో పూర్తి అవుతుందని అంచనా వేశారు. కానీ, లక్ష కోట్లకు పైనే ఖర్చు చేశారు. సివిల్ వర్క్స్‌లోనే రూ.43వేల కోట్లు పెంచారు. కాంట్రాక్ట్ కంపెనీలు ఎత్తిపోతల కోసం మోటార్లను, పంపులను కొనుగోలు చేసిన సమయంలో భారీగా అవినీతి జరిగింది. త్వరితగతిన పూర్తి చేసేందుకు భారీగా అంచనాలను పెంచుకుని టెండర్స్, నామినేషన్‌తో దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ మేఘా 30శాతం కమీషన్స్‌తో సబ్ కాంట్రాక్టులు ఇచ్చింది. ఆ డబ్బులు తిరిగి ప్రధాన కాంట్రాక్టర్ కు చేరేలా, జీఎస్టీలు ఎగవేయడం, ఇన్పుట్ సబ్సిడీ తెచ్చుకునేలా బినామీ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ సొమ్మును క్యాచ్ రూపంలో మార్చడం జరిగింది. ఇలా రూ.70వేల కోట్ల నగదును మార్చి రూ.12వేల కోట్ల జీఎస్టీ ఎగవేశారని 2021లో జీఎస్టీ హైదరాబాద్ బ్రాంచ్‌లో రిపోర్టు ఉంది. ఈ రిపోర్టు దాచిపెట్టేందుకు, తారుమారు చేసేందుకు లంచాలు ఇచ్చారని అనుమనాలు ఉన్నాయి.
కమిషన్ నివేదిక తర్వాత ఏం జరగబోతోంది?
వేల కోట్లతో కట్టిన మేడిగడ్డ కుప్పకూలింది. ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచే పరిస్థితి లేదు. ఇతర బ్యారేజీల్లోనూ లోపాలు బటయపడ్డాయి. దీంతో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు, అంచనాలు పెంచడం వెనుక జరిగిన వ్యవహారాలను బయట పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసింది. కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వామ్యమైన అధికారులను ఈ కమిషన్ విచారణ జరుపుతోంది. ఇప్పటికే పలు దఫాలుగా కీలక సమాచారం రాబట్టిన కమిషన్, త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. కొందరు అధికారులు, కాళేశ్వరం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని చెప్పారు. హరీష్ రావు పాత్రపైనా కీలక సమాచారం అందించారు. ఇక కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించి కేటీఆర్‌కు ఉన్న లింకులపై అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికపై ఉత్కంఠ నెలకొంది. నిజానిజాలన్నీ బయటకొస్తే, డిసాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద కేసులుంటాయి. నిర్లక్ష్యం, కుట్రపూరితం అంటూ క్రమినల్ కేసులకు ఛాన్స్ ఉంది. అదే జరిగితే, గత ప్రభుత్వ పెద్దల అరెస్టులు తప్పవు. అందుకే స్కిల్ యూనివర్సిటీకి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ రూ. 200 కోట్లు కేటాయించి, ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.