తెలుగుదేశం పార్టీ యువనేత, ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యండిల్ లో ప్రకటించారు. తాను ఇక ఏ రాజకీయ పార్టీలో చేరబోనని లాయర్ గా తన వృత్తిని కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. ఫైబర్ నెట్ చైర్మన్ గా ఆయన కొద్ది కాలం కిందటే బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఫైబర్ నెట్ లో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. రామ్ గోపాల్ వర్మకు పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించిన వైనాన్ని జీవీ రెడ్డి బయట పెట్టి ఆయనకు నోటీసులు జారీ చేశారు. పదిహేను రోజుల్లోగా డబ్బులు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ మధ్య 410 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. వారం రోజుల కిందట ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేరుగా ఫైబర్‌నెట్ ఎండీ, ఐఏఎస్ దినేష్ పై ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు రాకుండా కాపాడుతున్నారని మండిపడ్డారు. 410 మంది ఉద్యోగుల్ని తీసేయమని చెప్పినా ఇంకా జీతాలిస్తున్నారని.. ఆ డబ్బుల్ని దినేష్ దగ్గర నుంచి వసూలు చేయాలన్నారు. దినేష్ పేషీలో పని చేస్తున్న ముగ్గురు అధికారుల్ని విధుల్నించి తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
దినేష్ కుమార్‌పై సంచలన ఆరోపణలు !
జీవీ రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆయన చేసిన ఆరోపణలపై ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో సంబంధిత శాఖకు మంత్రి అయిన బీసీ జనార్ధన్ రెడ్డి ఈ వ్యవహారంపై ఆటు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ తో పాటు ఇటు ఆరోపణలు చేసిన ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డిని పిలిచి మాట్లాడారు. జీవీ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని అడిగినట్లుగా తెలుస్తోంది. ఆయన తన వద్ద ఉన్న సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏదైనా సమస్య ఉంటే.. సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి, మంత్రి ద్వారా తన దృష్టికి తీసుకురాకుండా బహిరంగ ఆరోపణలు చేయడమేంటని జీవీరెడ్డిపై చంద్రబాబు మండిపడ్డారు. దీంతో హార్ట్ అయిన జీవీ రెడ్డి హఠాత్తుగా రాజీనామా చేశారు. గతంలో వైసీపీలో పని చేసిన జీవీరెడ్డి అక్కడ సరైన గౌరవం లభించకపోవడంతో టీడీపీలో చేరారు. ఆయనకు మంచి వాగ్దాటి ఉండటంతో అధికార ప్రతినిది హోదా ఇచ్చారు. టీవీ చర్చల్లో ధాటిగా టీడీపీని సమర్థించేవారు. వైసీపీ తీరును ఎండగట్టే వారు. జీవీ రెడ్డి వ్యవహారంపై టీడీపీ క్యాడర్ లో సానుభూతి ఉంది. ఆయనకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
నాయకులు, కార్యకర్తల కంటే బాబుకి ఐఏఎస్‌లే ముఖ్యమా ?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, అధికార ప్రతినిధి హోదాకు కూడా జీవీ రెడ్డి రాజీనామా చేసేశారు. టీడీపీ అధిష్టానం కూడా ఆయన రాజీనామాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమోదించేసింది. అయితే ఈ వ్యవహారంలో టీడీపీ హైకమాండ్ తీరుపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. జీవీ రెడ్డి వైపే 99 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. జీవీ రెడ్డి రాజీనామా విషయంలో చంద్రబాబు తప్పు చేసారని.. ఇలాంటి వాళ్లను పోగొట్టుకోవడం పార్టీకి మంచిది కాదని సూచిస్తున్నారు. ఫైబర్ నెట్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందులోని అవకతవకలపై దృష్టి పెట్టారు జీవీ రెడ్డి. దాన్ని ప్రక్షాళన చేయాలని తలపెట్టారు. అయితే తన ప్రయత్నాలకు అడుగడుగునా బ్రేకులు వేస్తూ వచ్చారు ఎండీ దినేశ్ కుమార్. ఎంతగా చెప్పి చూసినా వాళ్లు కేర్ చేయలేదు. దీంతో జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫైబర్ నెట్ లో ఏం జరుగుతోందో బయటపెట్టారు. ఐఏఎస్ అధికారిపైనే జీవీ రెడ్డి అలా మాట్లాడడంతో అధికారుల సంఘం అభ్యంతరం తెలిపింది. వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లింది. జీవీరెడ్డిని పిలిపించి చంద్రబాబు మందలించారు. ఇంకోసారి ఇలా జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అక్రమాలను బయటపెట్టడమే నేరమా
ఓ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టడమే నేరమా అని జీవీ రెడ్డి ఆవేదన చెందారు. అందుకే ఇలా సర్దుకుపోవడం కంటే రాజకీయాలు వదిలేసి న్యాయవాద వృత్తి చేసుకోవడమే బెటర్ అనుకున్నారు. వెంటనే రాజీనామా చేసేశారు. పార్టీ కూడా ఆమోదించేసింది. అయితే టీడీపీ కేడర్ మొత్తం జీవీ రెడ్డికి అండగా నిలుస్తోంది. పార్టీ హైకమాండ్ జీవీ రెడ్డి ఇష్యూపై పునరాలోచించాలని సూచిస్తున్నారు. క్రమశిక్షణ పేరుతో ఇలాంటి నేతలను వదులుకుంటే పార్టీకి నష్టం తప్ప లాభం ఉండదని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో జీవీ రెడ్డికి అనుకూలంగా కుప్పలుతెప్పలుగా మెసేజ్ లు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవంకోసం పుట్టింది. ఇప్పుడు జీవీ రెడ్డి కూడా తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా లేక రాజీనామా చేశారు. పైగా అవినీతిని, అక్రమాలను కొమ్ముకాయలేనని తేల్చేశారు. కానీ టీడీపీ హైకమాండ్ మాత్రం అవినీతి అధికారులవైపే నిలిచింది. దీన్ని జీవీ రెడ్డి తట్టుకోలేకపోయారు. చివరకు జీవీరెడ్డి రాజీనామా తర్వాత దినేశ్ కుమార్ ను బదిలీ చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పార్టీ ఓ సమర్థుడైన నేతను కోల్పోయింది. పైగా అవినీతి అధికారులకు టీడీపీ వత్తాసు పలుకుతోందనే పేరు బలంగా ప్రజల్లోకి వెళ్లింది. కరుడుగట్టిన టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఈ విషయంలో హైకమాండ్ దే తప్పు అని జీవీ రెడ్డే కరెక్ట్ అని చెప్తున్నారు.