Exams time No Tenction Time : పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించడం ఎలా?

0

ఇంటర్మీడియెట్‌, పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన పెరగడం సహజమే. అయితే, ఈ ఒత్తిడి ఆందోళనకు ప్రధాన కారణం అభ్యసన సరిగా చేయకపోవడమే ! ఒక సైనికుడికి ఆయుధం ఎంత అవసరమో.. ప్రతి విద్యార్థికి పరీక్షల కొరకు అభ్యసన అనేది అంతే అవసరం. అభ్యసన ద్వారానే ఆయుధం అనే జ్ఞానం, శక్తిని సంపాదిస్తారు. అభ్యసన ద్వారానే మానసిక దృఢత్వం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారానే విజయం సునాయసమవుతుంది.అయితే, విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ప్రస్తుతం ఉన్న సమయంలో ఈ అయిదు అంశాలపైన దృష్టి పెట్టాలి. విజయానికివే అయిదు మెట్లు. ఈ అయిదడుగులు దాటితే విజయం ప్రతి ఒక్కరి సొంతమవుతుంది. వంద శాతం ఫలితాలు సాధ్యం.

పట్టుదల, లక్ష్యం అవసరం

ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొవాలి అందుకు తగ్గట్టుగానే తన ఆలోచన, తన ప్రతి కదలిక ఉండాలి. చదివింది చదవాల్సింది మాత్రమే గుర్తుకు రావాలి. అర్థం కాని అంశాలను గురువులతో లేదా తన తోటి మిత్రులతో అడిగి తెలుసుకొని అర్థమయ్యేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడిలా తన ముందున్న లక్ష్యంతో ముందుకు సాగాలి.

ఆలోచనలు నియంత్రణలో ఉంచాలి

విద్యార్థులు గతంలోని సంఘటనలను, బాధలను గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మరింత ఒత్తిడి పెరిగి చదువు నెత్తిన ఎక్కదు. అలాగే భవిష్యత్‌ గురించి గుర్తు చేసుకుంటే రేపు ఏమౌతదో అనే ఆలోచన ఆందోళనలను పెంచుతుంది. ఇలా గతం ఒత్తిడిని, భవిష్యత్‌ ఆందోళనలను మిగుల్చుతుంది. పైగా కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, కళాశాలలో జరిగిన సంఘటనలు, స్నేహం, ప్రేమ లాంటి అంశాలు అవరోధాలుగా మారి పరీక్షల సన్నద్ధతకు అడ్డుపడతాయి. కాబట్టి తమకు తాము నియంత్రించుకుని ప్రతి విద్యార్థి తమ ఆలోచనలను వర్తమానంలో ఉంచడానికి ప్రయత్నం చేయాలి. సబ్జెక్టు ఆలోచన తప్పితే వేరేదేం ఉండకూడదు.

సమయాన్ని సద్వినియోగం చేయాలి!

ఈ సమయంలో విద్యార్థులకి అత్యంత విలువైనది సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని పాఠ్యంశాలను ప్రణాళిక ప్రకారంగా తయారు చేసుకొని చదువే లక్ష్యంగా పూర్తి సమయాన్ని కేటాయించుకోవాలి. రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి గంట ముందు లేచి చదవడం ఉత్తమం. ఆ సమయంలోనే జ్ఞానేంద్రియాలన్నీ మన ఆధీనంలో ఉంటాయి.

అభ్యసనా, ఆత్మవిశ్వాసం ముఖ్య ఆయుధం

విద్యార్థుల అభ్యసన ఎంత బలంగా ఉంటే అంత ఎక్కువ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాస్‌ మార్కుల కోసం అర్ధం కాని కొత్త అంశాల జోలికి వెళ్ళకుండా ఇన్ని రోజులు చదివిన ముఖ్యమైన అంశాలు విషయాలనే పరీక్షల వరకు నిరంతర అభ్యసన కొనసాగించాలి. విద్యార్థులు చదివిందే చదివి అభ్యసించినట్లైతే ఎంతటి కఠినమైన పాఠ్యాంశమైనా సరే మెదడులో నాటుకుపోతుంది. ఈ అభ్యసన వలన ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగి పరీక్ష రాసే సమయంలో ఎలాంటి ఒత్తిడి ఉండదు.

సెల్‌ఫోన్‌తో దూరం ఉంటే ..

నేటి కాలంలో అవసరానికి మించి వాడుతున్న పరికరం మొబైల్‌ ఫోన్‌. ముఖ్యంగా విద్యార్థులకు సెల్‌ఫోన్‌ లేనిదే దినం గడవడం లేదు. ఇది సమ యాన్ని వృధా చేయడమే కాకుండా, చదువుపై ఏకాగ్రత లేకుండా చేస్తుంది. మెదడుపై, కంటి చూపుపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం పరీక్షల వరకు పక్కన పెట్టకపోతే సంవత్సరం మొత్తం కష్టపడ్డది వృధానే అవుతుంది.

విద్యార్థులపై అయిదు అంశాలను పాటించినట్లైతే తప్పకుండా పరీక్షలను సునాయసంగా జయించవచ్చు. వీటి వలన మానసిక ఆందోళన దూరమై బలమైన పాజిటివ్‌ ఆలోచనలు పెరిగి, మరింత చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన పెరుగుతుంది. వంద శాతం ఫలితాలతో విజయం సొంతమవుతుంది. కనుక విద్యార్థులే కాకుండా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా ఈ విషయాలపై దృష్టి పెట్టేలా చూడాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !