జేఈఈ మెయిన్ ఫలితాల విడుదలలో గందరగోళం నెలకొంది. సెషన్ 2 ఫైనల్ కీని గురువారం విడుదల చేసిన ఎన్టీఏ.. కొద్దిసేపటికే ఉపసంహరించుకుంది. ఇందుకు కారణాలను వెల్లడిరచలేదు. రాత్రి 10 దాటినా ఫలితాలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలను ఏప్రిల్ 2 నుంచి 9 వరకు ఎన్‌టీఏ నిర్వహించింది. ఏప్రిల్ 9వ తేదీన పేపర్-2ఏ, 2బీ (బీఆర్క్/బీ ప్లానింగ్) ప్రవేశ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. అయితే ఈ రెండు విడతల పరీక్షల్లోని ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని విద్యార్ధులకు ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ పై అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి తుది ఆన్సర్ కీ తోపాటు ర్యాంకులను కూడా వెల్లడిరచాల్సి ఉంది.
ప్రాథమిక కీలో తప్పిదాలు...తుది కీలోనూ తప్పులు !
జేఈఈ మెయిన్ పరీక్ష జవాబుల ఫైనల్ ఆన్సర్ కీ వచ్చేవరకు విద్యార్థులు వేచి చూడాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పేర్కొంది. ప్రాథమిక ‘కీ’లలో తప్పిదాల ఆధారంగా ఓ నిర్ణయానికి రావొద్దని సూచించింది. జేఈఈ-మెయిన్ సెషన్ 2 పరీక్ష సమాధానాల్లో పలు తప్పిదాలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తుండడంతో ఈ మేరకు ఎన్‌టీఏ (National Testing Agency) ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రాథమిక కీ మాత్రమే విడుదల చేశామని.. ఫైనల్ కీని విడుదల చేయలేదని పేర్కొంది. ఫైనల్ ఆన్సర్ కీ మాత్రమే స్కోరును నిర్ణయిస్తుంది.. ప్రాథమిక కీల ఆధారంగా విద్యార్థులు ఓ నిర్ణయానికి రావొద్దని ఎన్‌టీఏ సూచించింది. కానీ తుది కీలో కూడా తప్పులు ఉండటంతో ఉపసంహరించి ఉంటారని భావిస్తున్నారు. ఎన్‌టీఏ తప్పిదాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులతో పాటు పలువురు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద సంస్థ అలా ఎలా నిర్లక్ష్యంగా వ్యవహిస్తుంది, లక్షల మంది విద్యార్థులతో ముడిపడిన అంశాన్ని ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి ఇలా ఫైనల్ కీ లో తప్పులు అంటూ ఉపసంహరించుకోవటంపై విమర్మలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. అంటే జేఈఈ మెయిన్ లో కనీస మార్కులు సాధించిన 2. 50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా కేవలం 5 రోజుల సమయం ఉన్నందున ఈలోగా ర్యాంకులు ప్రకటిస్తారా ? లేదా ? ముందురోజే ఫలితాలు ప్రకటిస్తారా ? అన్నది వేచి చూడాలి.