HC Stay : తెలంగాణలో గ్రూప్‌ -1 అభ్యర్థులకు బిగ్‌షాక్‌ !

0

తెలంగాణలో ఇటీవల నిర్వహించిన గ్రూప్‌ 1 పరీక్ష నియామకాలు సర్వత్రా చర్చకు దారి తీశాయి. ఇప్పటికే దీనిపై టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చినా.. కొందరు అభ్యర్ధులు హైకోర్టును సంప్రదించారు. దీంతో గ్రూప్‌ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయమని హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించరాదని సూచించింది. అయితే ప్రస్తుతం నడుస్తున్న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగించవచ్చని పేర్కొంది. ముఖ్యంగా గ్రూప్‌ 1 మెయిన్స్‌ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌లో తాము తీర్పు వెలువరించే వరకు నియామక పత్రాలు జారీ చేయవద్దని తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ)కు స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల డేటా నమోదు చేసే లాగ్డ్‌ హిస్టరీ సమర్పణతో పాటు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని టీపీజీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.

హైకోర్టులో పిటిషన్‌

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 పోస్టులు భర్తీ చేసే క్రమంలో 2024 అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ సమాధాన పత్రాల మూల్యాంకనం జరిగింది. ఈ మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటు చేసుకున్నాయని దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె పర్శరాములుతో పాటు మరో 19 మంది అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ సమాధాన పత్రాలను సరిగా మూల్యాంకనం చేయలేదని, జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను తప్పుగా ప్రచురించారని పిటిషనర్లు పేర్కొన్నారు. అవకతవకల తీవ్రత దృష్ట్యా విచారణకు ఆదేశించి కోర్టు పర్యవేక్షించినా సరే లేదా స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలని అందులో కోరారు. అంతేకాకుండా తమ జవాబు పత్రాలను తిరిగి ముల్యాంకనం చేయాలని, లేదంటే తిరిగి మెయిన్స్‌ నిర్వహించేలా కమిషన్‌కు ఆదేశించానలి పిటషనర్లు విజ్ఞప్తి చేశారు.

వాదనలు ఇలా...చివరికి !

విచారణ సమయంలో పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైదరాబాద్‌లోని రెండు సెంటర్ల నుంచి ఏకంగా 71 మంది అభ్యర్ధులు ఎంపిక కావడం సందేహాస్పదంగా ఉందన్నారు. మొత్తం 563 పోస్టుల్లో ఇది దాదాపు 12 శాతమని అన్నారు. గ్రూప్‌ 1 మెయిన్స్‌కు తొలుత 21,075 మంది హాజరయ్యారని ప్రకటించిన కమిషన్‌ ఆ తర్వాత 21,085 మంది అని ఎందుకు చెప్పిందో తెలపాలని కోరారు. ఉన్నట్లుండి మరో 10 మంది ఎలా పెరిగారో వెల్లడిరచలేదని, ఉర్దూలో 9 మంది పరీక్ష రాస్తే.. 10 మంది అని ఎందుకు చెప్పారో తెలియజేయాలని కోరారు. ఇక జనరల్‌ ర్యాంకింగ్‌ ప్రకటన సమయంలో కంప్యూటర్‌లో మార్పులు చేశారని, 482 మార్కులు వచ్చిన ఓ అభ్యర్ధికి రీకౌంటింగ్‌లో 60 మార్కులు తగ్గడం, పరీక్షా కేంద్రాల పెంపు, ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు హాల్‌టికెట్ల నంబర్‌ మార్పుపై స్పష్టత లేకపోవడం.. వంటి పలు అంశాలపై పిటిషనర్ల తరపు న్యాయవాది సందేహాలను లేవనెత్తారు. కమిషన్‌ తరఫు న్యాయవాది పీఎస్‌ రాజశేఖర్‌ వాదనలు వినిపిస్తూ.. ఓ సెంటర్‌లో 792 మంది పరీక్షకు హాజరుకాగా 39 మంది (4.92%), మరో సెంటర్‌ నుంచి 864 మంది హాజరుకాగా 32 మంది (3.7%) ఎంపికయ్యారు. ఎంపికైన శాతం స్వల్పం. ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే ఆ సెంటర్లలోని అందరూ ఎంపికయ్యేవారు. అలా జరగలేదంటే ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా సాగిందని తెలుస్తోందని అన్నారు. రీ కౌంటింగ్‌లో ఒకరికి మార్కులు తక్కువ వచ్చాయన్నది కూడా నిజం కాదు. తొలుత, ఆ తర్వాత కూడా ఆ అభ్యర్థికి 422.5 మార్కులే వచ్చాయని, పోర్జరీ చేసి మార్కులు మార్చారని, అందుకు షోకాజ్‌ నోటీసు జారీ చేశామని కోర్టుకు నివేదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి నియామకాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !