పెట్రోల్ కొట్టించడానికి వెళ్లి వారెంత చెప్తే అంత బిల్లు కట్టేసి వస్తున్నారా.. ఈ నయా మోసం గురించి ఓ సారి తెలుసుకోండి. మీరు పెట్రోల్ డీజిల్ వంటివి పోయించుకునే ముందు అప్రమత్తంగా లేకుంటే జేబుకు చిల్లు పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే కొన్ని తరహా పెట్రోల్ బంకుల్లో కొత్త మోసాలు వెలుగు చూస్తున్నాయి. వీటిని ఓ కంటకనిపెట్టడం మంచిది.
పెట్రోల్ బంక్ వద్ద డిస్పెన్సర్ మీటర్ ‘0’ చూపిస్తే, మీరు చెల్లించినంత ఇంధనం వస్తుందని అనుకుంటే జాగ్రత్త ! ‘జంప్ ట్రిక్’ అనే కొత్త పద్ధతితో కస్టమర్‌లు మోసపోతున్నారు. ఈ ట్రిక్ ద్వారా చెల్లించిన దాని కంటే తక్కువ ఇంధనం వినియోగదారులకు అందిస్తున్నారు. గతంలో కొందరు బంక్ యజమానులు ఈ స్కామ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అయినా కొందరు తెలివిగా మళ్లీ మళ్లీ ఇదే మోసానికి పాల్పడుతున్నారు. దీని గురించి తెలియక చాలా మంది ఇప్పటికీ మోసపోతున్నారు. అసలు జంప్ ట్రిక్ అంటే ఏమిటి? దీంతో మీ జేబుకు చిల్లు ఎలా పడుతుంది అనే విషయాలు ఇక్కడ తెలుసుకోండి..
జంప్ ట్రిక్ అంటే ఏమిటి?
ఇది పెట్రోల్ బంకుల్లో వినియోగదారులను ఏమార్చే ఓ సరికొత్త టెక్నిక్. చెల్లించిన డబ్బుకు తగ్గట్టుగా కాకుండా తక్కువ ఇంధనం అందించి కస్టమర్లను బురిడీ కొట్టించడమే వీరి లక్ష్యం. దీనిపై అప్రమత్తంగా ఉంటే ఈ మోసాల నుంచి బయటపడొచ్చు.
ఇది ఎలా జరుగుతుంది?
ఇంధనం నింపేటప్పుడు మీటర్ సాధారణంగా నెమ్మదిగా పెరగాలి. కానీ ఈ ట్రిక్‌లో, ప్రారంభంలోనే మీటర్ 0 నుంచి ఒక్కసారిగా 10, 20 వంటి సంఖ్యలకు చేరుతుంది. దీంతో కస్టమర్‌లు పూర్తి ఇంధనం పొందుతున్నామని గుడ్డిగా నమ్ముతారు. దీనికి మెషిన్‌లో మార్పులు చేసి, రీడిరగ్‌ను అధికంగా చూపేలా సర్దుబాటు చేస్తారు.
ఈ చిట్కాలు పాటించండి:
మీటర్‌పై నిఘా ఉంచండి: ఇంధనం నింపే సమయంలో మీటర్‌ను గమనిస్తూ ఉండండి. రీడిరగ్ అసాధారణంగా అనిపిస్తే వెంటనే సిబ్బందిని అడగండి.
క్యాష్‌ను ఇలా ఎంచుకోండి: రూ. 500, రూ. 1000 కాకుండా రూ. 620, రూ. 1480 వంటి రేట్లు ఎంచుకోండి.
5-లీటర్ పరీక్ష: అనుమానం వస్తే, 5-లీటర్ కొలత పరీక్ష అడగండి. ఇది ప్రతి బంక్‌లో ఉండే సర్టిఫైడ్ కొలత సాధనం.
రసీదు తీసుకోండి: ఎలక్ట్రానిక్ రసీదు తీసుకుంటే, ఇంధన మొత్తం, ధరను ధృవీకరించవచ్చు.
విశ్వసనీయ బంకులు ఎంచుకోండి: పేరున్న పెట్రోల్ బంకులను ఎంపిక చేయడం సురక్షితం.
అప్రమత్తతే రక్షణ
జంప్ ట్రిక్ వంటి మోసాలు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. కొంచెం అవగాహన, జాగ్రత్తలతో దీన్ని నివారించవచ్చు. అనుమానం కలిగితే బంక్ సిబ్బందిని లేదా ఆయిల్ కంపెనీని సంప్రదించండి. మీ హక్కులు తెలుసుకుని, అప్రమత్తంగా ఉంటే మీ డబ్బుకు తగిన ఇంధనం పొందవచ్చు.